CL లను ఏ సందర్భంలో తిరస్కరించాలి ? మానేటి ప్రతాప్ రెడ్డి గారి వివరణ

*సెలవు పొందడం హక్కు కాదు, కానీ....! *
    *సెలవు పొందడం హక్కు కాదు, ఒక సౌకర్యం మాత్రమే. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప సెలవు తిరస్కరించకూడదు. స్కూలు నిర్వహణకు సదరు టీచర్ హాజరు తప్పనిసరైనప్పుడు లేదా అప్పటికే పరిమితి మేరకు టీచర్లకు సెలవు మంజూరు చేసిన సందర్భాల్లో మాత్రమే ఆకస్మిక సెలవు తిరస్కరించాలి. సెలవు తిరస్కరించడానికి గల కారణాన్ని పొందుపరుస్తూ Leave Refusal Registerలో విధిగా నమోదు చేయాలి. ఇవేవీ చేయకుండా కేవలం అధికారం ఉంది కదా అనే భావనతో సెలవు తిరస్కరించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత అభిమాన, దురభిమానాలను దృష్టిలో పెట్టుకొని సెలవు మంజూరు చేయడం లేదా తిరస్కరించడం రెండూ తప్పే! సెలవు మంజూరులో నిబంధనలు పాటించని అధికారులపై బాధిత టీచర్లు పై అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే క్రమశిక్షణ చర్యలుంటయ్! *

       *కొందరు అధికారులు ఆకస్మిక సెలవుల్లో కోత పెడుతుంటారు. పైగా తమ చర్య కరక్టే అని భావిస్తారు,  వాదిస్తారు కూడా. కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే సదరు చర్య తీసుకున్నట్టు బిల్డప్ కూడా ఇస్తారు. అంతే కానీ, తమ చర్య రూల్స్ కనుగుణంగా ఉందో లేదో పట్టించుకోరు. ఎవరైనా సలహా ఇచ్చినా బేఖాతరు చేస్తారు. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం మాత్రమే మొత్తం CLs ఇవ్వకుండా కోతపెట్టి... దామాషా ప్రకారం ఇవ్వాలి. మిగతా సందర్భాల్లో... అనగా... మెటర్నిటీ లీవ్, అర్థవేతన, జీతనష్టపు అసాధారణ సెలవు, రిటైర్మెంట్ తదితర సందర్భాల్లో CLs మొత్తం ఇవ్వాల్సిందే! డైస్ నాన్ గా ప్రకటించకపోతే సస్పెన్షన్ పీరియడ్ కు సైతం CLsతో పాటు HPL కూడా ఇవ్వాల్సిందే! కేవలం Earned Leave  మాత్రమే డ్యూటీ పీరియడ్ లెక్కించి నిల్వచేయాలి. విషాదం ఏంటంటే... మహిళా టీచర్లు మెటర్నిటీ లీవ్ పెట్టినప్పుడు... కొంతమంది MEOలు, హెచ్ఎంలు CLsలో కోత పెడుతున్నారు. ఫీడింగ్ మదర్ కాబట్టి, సానుభూతితో సానుకూలంగా స్పందించాల్సింది పోయి, ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టు కాదు. దాదాపు పుష్కరం క్రితం ఓ MEO మెటర్నిటీ లీవ్ పెట్టిన టీచరుకు ఆకస్మిక సెలవుల్లో సగం కోతపెట్టి మిగతా సగం మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ టీచర్ మహిళా కమిషన్ని ఆశ్రయించింది. ఏ ఉత్తర్వుల ప్రకారం మెటర్నిటీ లీవ్ పెట్టిన టీచరుకు CLs కట్ చేశారని కమిషన్ ప్రశ్నిస్తే సదరు MEO దగ్గర జవాబు లేదు. చివరికి MEO తప్పు ఒప్పుకొని టీచరుకు మొత్తం CLs ఇచ్చి కేసు నుంచి బయటపడ్డాడు. *
   
        *రిటైరయ్యే ఏడాది దామాషా పద్ధతిలో CLs ఇస్తామంటూ మరికొందరు అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.  ఉదాహరణకు ఏప్రిల్ నెలలో రిటైర్ కానున్న టీచరుకు మూడో వంతు CLs మాత్రమే మంజూరు చేస్తామని చెప్పడం. కేవలం నియామకమైన మొదటి సంవత్సరం మాత్రమే CLs ప్రపోర్షనెట్లో ఇవ్వాలి. మిగతా ఏ సందర్భంలోనూ ప్రపోర్షనెట్ చేయడానికి వీలులేదు. సెలవు కోరిన రోజుల్లో సదరు టీచర్ బడికి హాజరు కావడం తప్పనిసరి అయిన పక్షంలో సెలవు తిరస్కరించే అధికారం మంజూరు చేసే అధికారులకు ఉంది కదా! అదే విషయాన్ని చెప్పి సెలవు తిరస్కరిస్తే సరిపోతుంది కదా! అలా చెప్పకుండా సెలవులో కోత పెట్టడమే రూలన్నట్టు మాట్లాడ్డం విచిత్రం. ఇక్కడొక విషయాన్ని అందరూ గుర్తించాల్సి ఉంది. సెలవు మంజూరు అనేది అధికారులకు ఉన్న విచక్షణాధికారం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, తన చర్య రాగద్వేషాలకు అతీతంగా... నిబంధనలకు లోబడి ఉండాలి. అపోహలకు, అపార్థాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవ్! అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే యోచనతోనే ఈ పోస్టింగ్! *

*-మానేటి ప్రతాపరెడ్డి.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts